అనామికా శతకం విట్టుబాబు గారు

 


అనామికా శతకం

రచన విట్టుబాబు గారు

రోజు రెండు పద్యాల చొప్పున కవితా గానం సమూహం లో

పోస్ట్ చేయబడుతున్నవి

*************


శ్రీలఁ గురిపింౘు మురిపింౘుఁ జెలిమిఁ బంౘు

నడిగినప్పుడె చెప్పిన యట్టిమాట!

ఫలితమేదైన భరియింపఁ దలచినాడ

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు!


నిర్గుణుండని యందుము నిలుపువాని

కోహమని సృష్టికర్త సంకోచపడడె

యహము లేకున్నచో పుట్టదిహము కూడ!

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు!


తనకుఁ దోచిన యట్టులే తరులు గిరులుఁ

దనకుఁ దోచిన దంతయుఁ దగవు సొబగుఁ

దనకుఁ దోచిన ధర్మమే మనువు ౘనవు

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు!


మునిగితేలుట ముచ్చట లనుట కనుట

యనిన దానిని పదుగుర కంపుకొనుట

వలను చిక్కుట మురియుట బలపరౘుట

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు!


పగలు రాతిరి లేదట పగల వగల

చెలగి వారల వీరల వెలుగు తెరల

పొరల పొరలుౘు నుండును మరల మరల

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు!


నదుల కానకట్టలు గట్టి నగము తొలిచి

పశుల నాడించి క్రీడించి పరవశించి

వాడుకొందురు సర్వమ్ము పాప మనక

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు!


మేటి నుడులందుఁ బ్రవచింత్రు మేళ్ళు గొనుచుఁ

గూటికై కుత్సితములందుఁ గూరుకొంద్రు

చెప్పుటకుఁ జేతలకు భేదసిద్ధి యిదియె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! 


నీతి శతకాల నిర్మించి నియతగతిని

వేల వత్సరమ్ముల నుండి వేదవిదులు

కరములెత్తి రోదించినం గలదె ఫలము

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు!


పన్ను తప్పింౘుకొనఁ జూౘు ప్రజలతెలివి

ప్రజల నుండి లాగగఁ జూౘు పాలకాళి

తెరల ముందుండు నౘ్చఁపు దేశభక్తి

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు!


వెలుగు చీకటులెప్పుడు వెంట వెంట

కలుగు సుఖదుఃఖముల నీరు కంటివెంట

తళుకు బెళుకుల మనికిని కలల పంట

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౧౦


ఒరుల నొప్పింపఁగా లేని యోర్పు నొకటి

పరుల నొప్పింపఁగాఁ జూౘు పటిమ యొకటి

నరుల నడతల నొలికెడు నటనలవుర!

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౧౧


విలువలను బ్రోది సేయుౘు వివిధ గతుల

వానికిన్ వన్నెలద్దుౘుఁ బలుకుౘుంద్రు

చేతలో సుంత కనరాదు నీతి ఘనత!

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౧౨


నిప్పుఁ బుట్టెను దొలినాడు నేర్పెవరిదొ

వెలిసె చక్రమ్ము మరునాడు వెలుగెవరిదొ

శ్రమలు ఫలితాలు భిన్న సంస్థాగతములె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౧౩


బ్రహ్మ సృష్టించినట్టి సర్వమును భ్రాంతి

గనుక కోరుౘునుందు ముక్తిని సతమ్ము

సత్యము ధనమ్మె మానవజనిత మగుట

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౧౪


క్రమక్రమంబుగఁ దగ్గుౘుఁ గలియుగమున

ధర్మ మొకపాదమే యని మర్మమెఱిఁగి

పూర్ణముగ లేదు లేదని పొగలనేల?

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౧౫


కూడి యేరోటి కా పాట పాడు వారు

చేరి తమ లబ్ధికై యన్యు దూఱువారు

గడుసుగాఁ దమ పబ్బముల్ గడుపుకొనరె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౧౬


ఆర్షధర్మము రక్షింతుననుౘుఁ బలుకు

చేతి వాటముఁ జూపెడి రోఁత పనులు

తగుదుననుౘును చేజాఁపు ద్వంద్వవృత్తి

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౧౭


జీవితమును నాటకమని చెప్పుమాట

ముందు నిడుకొనుౘు నటనమునఁ జెలంగి

ధనమె సర్వమ్ముగా సాగు ఘనత మనది

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౧౮


ఘనతరమ్మగు దైవాల కథలయందు

మనుజులను మింౘు గుణములఁ గనగలేము

మనది కానిది పలికింప మనతరమ్మె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౧౯


దైవ నిలయాల నర్చింప తరలు వార

లంద రన్నింట సమభాగ్య మందలేరు

ధనము గలవారికే శీఘ్రదర్శనములు

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౨౦


ఓటులను నమ్ముకొందురు నోటు కొఱకు

నమ్మి కొనెడి వారాశల వమ్ము చేయ

నీతి లేదంౘు రోదింౘు నేటి తీరు

లడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౨౧


వేకువనె లేచి చీకట్ల వెంట నడచి

దొంగతనముగ దోసిళ్లతో గ్రహించి

విరులఁ దమిని పూజింౘు టే విధపుభక్తి?

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౨౨


దినదినమ్మున కొక పేర దినముఁ బెట్టి

వంతులుగ శుభాకాంక్షలఁ బంౘుకొనెడి

రీతి సామాజిక సమూహ నీతి యాయె

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౨౩


నిపుణతను బెంౘుకొను మాట నీటిమూట 

ౘదువు సంపాదనమునకె, పదవి కొఱకె

ప్రాథమికహక్కు విద్య వ్యాపారమయ్యె

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౨౪


గుంపులను గట్టుకొనుచుండి కూడుకొనుౘు

నాబగా మెౘ్చుకొనుచుందు రహరహమును

విలువ లేనట్టి వ్రాతలఁ జెలిమి పేర

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౨౫


చిత్తమును బెట్టి శ్రమను గృషీవలుండు

నారుగాలమ్ముఁ బండించి యమ్మబోవ

నిమ్ముగా నొప్పు ధర నిర్ణయింౘలేమి

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౨౬


రుచి నెఱుంగని యాకలి శుచియుఁ గనదు

సుఖ మెఱుంగని నిద్దుర సొబగు గనదు

కలిమిలేములు మురిపింౘు కవలలనుౘు

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౨౭


ప్రకృతియందు సర్పమ్ములుఁ బక్షితతులు

వనములు నదులుఁ బశువులుఁ బర్వతములు

సర్వమును భావనీయమ్మె సార్థకమ్మె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౨౮


నదులు ప్రవహింౘు నిరతమ్ము నవరసముల

దరులు పుష్పింౘు నర్చింౘు పరిమళముల

గుణసమన్వితమే జీవకోటి యెల్ల

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౨౯


మాటతోఁ జేయు గాయమ్ము మఱచిపోరు

మనసుతోఁ జేయు సాయమ్ము మఱువబోరు

మాట మనమున సమముగ  మసల జాల

రడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౩౦


కలిమినుండగఁ గనుమిన్ను గానఁబోడు

లేమిలోఁ బొందు సాయమ్ము లేనినాఁడు

వగచి దూషింౘు నెల్లరన్ బగతురనుౘు

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౩౧


అనగ ననగఁ గవి వసింపఁ గనెడి చోటు

విక్రమార్కుని గద్దెయె, విబుధమతులు

నగుదురందరుఁ జెప్పగ నగుౘు సూక్తు

లడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౩౨


నీటికిని గాలికిని నింగి నిప్పులకును

గులమతమ్ముల తేడాలు గలవొ లేవొ

మహితగుణుఁ డనుకొనుౘున్న మనిషి కుండు

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౩౩


మొదట నొక్కండుఁ బాటింౘునదియె వింత

పదుగు రా దారి నడువగాఁ బద్ధతియగు

నదియె యాచారమగు, ధర్మమదియె యనుౘు

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౩౪


నేలకును హద్దులను గీసి నీతియనరె

నదుల నీటిని వాటాలఁ బొదువుకొనరె

కడలి యైన వీడక హక్కు లడుగఁబోరె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౩౫


తగిన దారిని నడువని తనయునైనఁ

దగిన రీతిని దండింౘు తపన గలదు

సత్య దోడుగ సాగిన చక్రి వోలె

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౩౬


ఋతువు ఋతువున కొక్కొక్క గతియుఁ గలదు

బ్రతుకు బ్రతుకున కొక్కొక్క వెతయుఁ గలదు

వెతల గతుల మీఱిన యున్కి వేడుక యగు 

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౩౭


పోస్టులకు భేషు భేషని పొగడుకొనుట

ధన్యవాదములందెడి తపన నుంట

నేటి వాట్సపు జనముల నీతి యగుట

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౩౮


ఉదయమున నేగి యుద్యోగ సదనమునకుఁ

గదలి గృహము చేరెదరెల్ల నిదుర కొఱకు

నగరముల నిళ్ళు సత్రాల పగిది ననుౘు

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౩౯


జీవజాలఁపు మనికికిఁ జేవ యగుౘుఁ

దనదు భ్రమణమ్ము దనౘుట్టుఁ దగినయట్లు

మనుజులకు భ్రమణము సదా ధనము ౘుట్టు

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౪౦


మనికి నుండగా నెట్లుఁ దిట్టినను గాని

మరణమును బొందువారలు మంచివార

లనుౘు పరిగణింౘుట లేద మనుజులెపుడు

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౪౧


నలుపు తెలుపుల తేడాల నలుగుౘున్న

దైవమును జూడు మార్గాల తగవులున్న

మనుజులందరు నొక్కటే యనుట లేదె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౪౨


పుట్టెదరు కోట్లుగాఁ బుట్టి పోవుౘుంద్రు

పోవు వారెల్ల ఖ్యాతిని పొందగలరె

బ్రదుకును దపస్సుగా నెంచి యెదుగనపుడు

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౪౩


పరులకును వెలుంగుల నిౘ్చు బ్రతుకులున్న

వెతల పాలౌౘు వెలిగింౘు బ్రతుకు సున్న

వ్యక్తిగా, శక్తిగా వెల్గు బ్రతుకు మిన్న

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౪౪


జన్మముల శ్రేష్ఠముఁ బురుష జన్మమనుట

పురుష పుంగవ శోధనములు నిజంబె

పొలతి లేకున్న లోకాన పుట్టువెటుల

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౪౫


ఒకడు సాకార శిల్పాల నొప్పుఁ గొనడె

యొకడు నాకార రహితుని నొదిగి కనడె

యొకడు దానె బ్రహ్మమని నియుక్తిఁ గొనడె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౪౬


రాజకీయ నాయకుల యారాటములకు

వీథి వీథి విగ్రహముల వెలయఁజేసి

స్వామిభక్తియనుట యనుచరుల బుద్ధి

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౪౭


పదవి నందగా జనుల నాపదలఁ బెట్టి

యదనుగాఁ దానె దిక్కంౘు వదరుచుండి

ఓటులను బొందగా నాడు నాటకముల

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౪౮


ఎన్నికల పోరులో నన్ని యిన్ని తిట్టి

పిదప బలము చాలకయున్న నదను జూచి

రాసుకొని పూసుకొనుటయే రాజకీయ

మడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౪౯


గద్దె పై నుండి చెప్పెడి సుద్దులన్ని

గద్దె దిగినంతఁ బాటింౘు కరణి గలదె

యవసరార్థము మారుట ౘవటబుద్ధి

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౫౦


తరతరమ్ముల త్యాగాలఁ దలౘుకొనుౘు

వత్సరమ్మున కిరుమార్లు వందనములఁ

జేసి దేశభక్తినిఁ జూపి చెలగు జనము

లడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౫౧


పిల్లికిని బిచ్చమీయని పిసినిగొట్టు,

కాకికిని చే విదల్చని ఘనులు నున్న

దయను బరుల మేల్గోరు దాతలును లేరె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౫౨


నయముగా నిదానము ప్రధానమను సూక్తి

నియతి నాలస్య మమృతమని యొక నీతి

భిన్న వాదాల లక్ష్యమ్ము నెన్న నొకటె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౫౩


వేషముల నెల్ల పొగడిన వేత్త యనుట

దోషముల నెత్తి చూపిన ద్రోహి యనుట

విషపు రాజకీయములందు వింత గాదె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౫౪


సీట్లకై నాయకులు నెన్నొ పాట్లు పడుౘుఁ

గోట్ల రూకల వెచ్చింతు రోట్ల కొఱకుఁ

గట్టుబడిర నీతికిఁ గూడఁ గట్టిరెట్లొ

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౫౫


కవనములు నర్తనములు నా గానములును

జనుల మెప్పించి మేల్కొల్పు జతనములని

కళలు సామాజిక వికాస కారణమని

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౫౬


తేనెపట్టు, పక్షుల గూళ్ళ తెలివి లేదె

సాలె గూడు, చీమల పుట్ట సాటి గలదె

మేధ మానవునికి సొంతమే జగాన

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౫౭


బాస లెన్నెన్నొ బాసల యాసలెన్నొ

యూసు లెన్నెన్నొ యూసుల యాసలెన్నొ

వేసములు నెన్నొ వేసాల వెతలు నెన్నొ

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౫౮


ప్రతి సుమమ్మున కొక తావి పరఁగు నటులె

ప్రతి మతమ్మున కొక బోధ యతికి నటులె

ప్రతి ప్రయత్నమునకుఁ దగు ఫలములుండు

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౫౯


సర్వజనులొక్క తీరుగా సాగగలరె

యన్ని యెదలొక్కతీరున నలరగలవె

భిన్నభిన్నస్వభావాల నెన్నగలమె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౬౦


రాజరికమును నొకనాఁడుఁ బ్రకటమయ్యెఁ

బరుల పీడన మొకనాఁడుఁ బ్రాప్తమయ్యెఁ

బ్రజల పాలనమీనాఁడుఁ బటుతరమ్మె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౬౧


ఓడలును బండ్లుగా మారు నోటములకు

బండ్లు నోడలుగా మారుఁ బ్రాప్తములకు

సుస్థిరమ్మగు నేది యే దస్థిరమ్ము

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౬౨


జనని జన్మభూమియు స్వర్గమునకు మిన్న

యనిన రాముఁ గొల్చెడి దేశమునను బుట్టి

మనుటకై విదేశములేగు జనము లుందు

రడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౬౩


సుజనుడైనఁ బండితుడైనఁ గుజనుడైనఁ

దన కుటుంబము న్బోషింపఁ దపన పడరె

తనకు మాలిన ధర్మము తగదను నుడి

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు!   ౬౪


తల్లిదండ్రుల వదిలిన తనయులొకటఁ

బిల్లలను వీడి చేరెడి పెద్దలొకట

నతిశయింౘుౘునుండె వృద్ధాశ్రమములు

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు!  ౬౫


జడములకు భావనములద్ది సరసగతిని

కైతలను గథలను వ్రాసి గీతములను

బాడి మురిసిపోదురు గదా పాడి యనుౘు

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు!  ౬౬


మేకను బులి తినుట యందు మేక గడ్డిఁ

దినుట యందుఁ గలదు కద మనికి నిౙమె

ప్రాణు లాహారమగు నెప్డుఁ బ్రాణితతికి

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు!  ౬౭


అధికుఁడగువానితో మైత్రి యల్పునకును

బ్రాణసంకట మెప్పుడుఁ బట్టు విడిన

నష్టపోవును వాఁడెగా కష్టజీవి

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౬౮


నియతముగ ప్రతిదానికి నీడ యండుఁ

గర్మమునకుఁ దప్పక ప్రతికర్మముండు

ఫలితమేదియు లేనట్టి వ్రతముఁ గలదె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు!  ౬౯


జన్మమువలనఁ గర్మము జనితమనగఁ

గర్మఫలమున జన్మము గలుగు ననగ

నాది యేది యీ ప్రకృతి ననాది యేది

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు!  ౭౦


పడవ నడిపెడి యమ్మకుఁ బొడమె నొకఁడు 

నడవి జాతిని పుట్టిన యయ్య యొకఁడు

జాతిచర్చలు మనకేల నీతిఁగనరె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౭౧


పంచభూతాలపైఁ దన పట్టు కొఱకు

నెన్నొ యత్నమ్ములను జేయ నెంౘు నరుడు

విలయమును నాపలేమని తెలిసికూడ

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౭౨


జలము నుండి విద్యుచ్ఛక్తి వెలికివౘ్చు

విద్యుదావేశమున బల్బు వెలుగవౘ్చు

శక్తికిం బుట్టువులు మెండు సహజగతిని

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౭౩


ౙరుగునంత కాలంబుఁ బొగరును గలిగి

యొరుల దూషించి తోషాల విరులఁ జిదిమి

శిరముపై నుంచి కన్నులఁ దిరుగుౘుందు

రడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౭౪


చెవులు విన్నదంతయు నిౙమవునొ కాదొ

కనులు గన్నదంతయు నిౙమనుట గలదొ

రసన యన్నదంతయు నిౙమొ, సరి కాదొ

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౭౫


తెల్లవారును దనకోడివల్ల ననెడి

తెలివిఁ జూపెడి పాత్రలు తెనుఁగు కతలఁ

దెలుపు నీతుల వినువారు గలరొ లేరొ

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౭౬


కష్టమెఱుఁగని సుఖములఁ గలదె విలువ 

దుఃఖములు లేక విలువేది తోషములకు

రేబవళ్ళు గల్గుటయన్న లెక్క లేదె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౭౭


దేశముల కూటములు నెన్నొ తీర్పులెన్నొ

కూటముల వేషములు నెన్నొ కుట్రలెన్నొ

వేషముల వ్యర్థములు నెన్నొ భూషలెన్నొ

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౭౮


తెరల వెనుకఁబడుటయ కొందఱికిఁ బ్రియము

దెరల ముందుఁబడుటయ కొందఱికిఁ బ్రియము

దెరల పొరలఁబడుటయ కొందఱికిఁ బ్రియము

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౭౯


వానిఁ జూచి నేర్చుకొనుమా, వీని వలెను

నీవు నుండగాఁ దగునన్న నీతులేల

చేతి వ్రేళ్ళన్ని యొకరీతి చేవ గలవె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౮౦


గురువులందున నుత్తమ గురువు కొండ

కాని దూరమునుండియే దాని నునుపు

చెంతఁ జేరినఁ గనవౘ్చు వింతలెన్నొ

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౮౧


ఒకఁడు పైవాఁడు లేడను నొక్కఁడేమొ

వాని సర్వంబుగానెంచి తాను బ్రతుకు

మనిషి తనవలె మనలేక గొణుగునిట్లు

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౮౨


ప్రకృతిసిద్ధముగా నేది బ్రకటమైన

మనిషి తనకుఁ దానుగఁ జేసుకొనినదైనఁ

గారణము లేక యుండదు కార్యమేది

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౮౩


జనుల కుపయోగపడని విజ్ఞానగరిమ

పుస్తకములందుఁ బెద్దలమస్తకములఁ 

గలదు కలదంౘు గర్వింపఁ గలుగు నౌర!

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౮౪


పుట్టి బుద్ధి నెఱింగినన్ ముౘ్చటలను

బుట్టుకను వౘ్చునది పోవుఁ బుడకలనని

పట్టుదలఁ గొట్టుమిట్టాడు బంధనముల

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౮౫


ఔరసత్వము నందెడి యాస్తి కొఱకు

వాదులాడగఁ జూచెడి వారె గాని

సోదరులు పొత్తునుండుట చోద్యము గదె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౮౬


పెద్దదాని కిచ్చితివింత పెళ్ళినాడు

నాకు నాపాటి నిౘ్చుట న్యాయ్య మనుౘు

వంతులను పెట్టుకొను వార లింతులవుర

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౮౭


వేసవినిఁ ౙల్లదనమున కాసపడుట

శీతమున వెౘ్చదనమును నూత గొనుట

కష్టములఁ ద్రుంౘగా మారు నిష్టములట

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౮౮


తనకు వలసినదేదియో తగినదెదియొ

తపన లేమియొ భ్రమలేవొ తగవులేవొ

తెలియకున్నను నటనలు తెలిసినట్టు

లడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౮౯


పుట్టునది పోవు నెటులైన తుట్టతుదకుఁ

బోవునది వేఱు రూపానఁ బుట్టు నటులె

తాను కనుమఱుఁగగుటయే తన వినాశ

మడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౯౦


పలికెలే కుమాతా న భవతి యనుౘును

నాదిశంకరుడు నయిన నమ్మ లేదె

కన్న బిడ్డల శపియింప కద్రువకట

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౯౧


కనినతల్లిగా ననురాగము నొక చోటఁ

గనగ నత్తగా నధికారము నొక చోట

నత్తయై యమ్మగా నుండుమనిన చేట?

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౯౨


అస్తమింౘగ రవి చంద్రు డవతరింౘు

నొకని విజయంబు నపజయం బొకని కగును

ఘటన యొక్కటె ఫలితాల కతలు వేఱె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౯౩


కలసివచ్చిన కాలాన ఘనులమనుౘు

రొమ్ము విఱిచి పాలకులు పల్కుదురు కాని

తెల్లమగు నుపద్రవముల డొల్లతనము

నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౯౪


గాలి దూరని విధమున గది బిగించి

నాల్గు గోడలమధ్యన నవతరమ్ము

విశ్వదర్శనమును జేయు వింతలేటి

కడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౯౫


అవసరమ్మగు వేళల నధికులనుౘు

నవసరము దీరిపోయిన నల్పులనుౘు

స్వీయ లాభప్రమాణతన్ జెలగు మనుజు

లడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౯౬


గుణమునకు నొక్క జంతువు గొప్పదనుౘు

గుఱుతుల నెఱింగి పలికెడి నరులు మఱలఁ

దామె గొప్పవారమటంౘుఁ దపనఁ బడరె

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౯౭


నీరు పల్లమెఱుఁగు నిప్పు నింగి కెగయు

గాలి యల్పపీడనమునఁ గదలుఁ గాని

మనుజవర్తనము నెఱుంగ మనతరమ్మ

యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౯౮


పలుకు పలుకున మధురిమ లొలుకునటుల

మాటలాడుట జగతి సమ్మాన్యవిద్య

సూటిపోటిగఁ బలుకుట యాట మనిషి

కడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౯౯


కొంత నేను జూచినయట్టి వింతలందు

కొంత నేను వినినయట్టి గొడవలందు

తెలిసికొని పల్కితిని కాదు కలుషదృష్టి

యడుగకున్నను జెప్పితి నవని తెఱఁగు! ౧౦౦

****************

బ్లాగ్ నిర్వహణ

శివునూరి లలితాకృష్ణ

వీరా గుడిపల్లి

Comments

Popular posts from this blog

తిరు వేంకటాచార్యులు KS 6

బాటసారి KS 12